కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో హనీట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యోగా గురువు రంగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఓ గ్యాంగ్ పెద్ద ఎత్తున బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చెప్పి ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. నెమ్మదిగా ఆయనతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. ఈ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఆధారంగా చేసుకుని మహిళలు రంగారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు.
ఆ వీడియోలను బయటపెడతామంటూ, గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు అమర్ సహా ఇతరులు రంగారెడ్డిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మొదట రూ.50 లక్షల చెక్కులు తీసుకున్న ఈ గ్యాంగ్, మరో రూ.2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తనను ఇబ్బంది పెట్టుతున్నారని రంగారెడ్డి నేరుగా గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగారెడ్డి అందించిన వివరాలు, ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఆపై ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ హనీట్రాప్ కేసు వెలుగులోకి రావడంతో నగరంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకవైపు ఆధ్యాత్మిక రంగంలో పేరుగాంచిన యోగా గురువును టార్గెట్ చేయడం, మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు గ్యాంగ్‌పై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


