ఆవిష్కరణలకు కేరాఫ్‌గా హైదరాబాద్
ఇకపై ఇక్కడే ఫైటర్ జెట్ సిమ్యులేటర్ల తయారీ..
విశ్వనగరం కీర్తిని జెట్ వేగంతో గగనతలానికి తీసుకెళ్లాలి
పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో టీ-వర్క్స్ వేదికగా యుద్ధ విమానాల ఫ్లైట్ సిమ్యులేటర్ రూపుదిద్దుకుంటోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే సిమ్యులేటర్లను ఇప్పటి దాకా భారీ వ్యయంతో అమెరికా, యూరప్‌ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా ఇకపై ఆ అవసరం ఉండదు. పైగా మనమే అగ్రదేశాలకు ఎగుమతి చేయగలిగే సాంకేతిక వృద్ధి చెందుతుంది. ఇటీవల టీ-వర్క్స్ ను సందర్శించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల సేపు పరిశోధనల పురోగతిని పరిశీలించి, ఇంజనీర్లనతో సమీక్ష నిర్వహించారు. తక్కువ సమయంలో క్లిష్టమైన పరిశోధనలను పూర్తి చేసి ఆర్డర్లు సాధించినందుకు ప్రత్యకంగా ప్రశంసించారు. సాధ్యమైనంత త్వరలో అత్యాధునిక సిమ్యులేటర్లను రూపొందించి విశ్వనగరం హైదరాబాద్ కీర్తిని జెట్ వేగంతో గగనతలానికి తీసుకెళ్లాలని సూచించారు.
ఫ్లైట్ సిమ్యులేటర్ల ఉత్పత్తి కేంద్రంగా రాజధాని..
ఈ సిమ్యులేటర్ల మరో ప్రత్యేకత ఏమిటంటే దిగుమతి చేసుకునే వాటికంటే అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉంటాయ. దిగుమతి చేసుకునేవి దిగువన పీఠం నుంచి అన్ని వైపులా 30 డిగ్రీల మేర మాత్రమే వంగడం లేవడం చేయగలుగుతాయి. యాక్సియల్ ఏరో రూపొందిస్తున్న సిమ్యులేటర్లు 360 డిగ్రీల మేర తిరుగగలిగే స్టివార్టు ప్లాట్ ఫామ్ ను కలిగి ఉంటాయి. దీని వల్ల యుద్ధ క్షేత్రంలో శత్రువుకు దొరకకుండా తప్పించుకునేందుకు ఫైటర్ జెట్లను నడిపించే పైలట్లు అనుసరించే విన్యాసాలన్నీ ఇందులో సాధ్యమవుతాయి. సిమ్యులేటర్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైతే విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలు పుట్టుకొస్తాయి. ఎంఎస్ ఎంఈ రంగం కూడా ప్రయోజనం పొందుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఫ్లైట్ సిమ్యులేటర్ల ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.


