జాతీయ స్థాయిలో మెరిసిన హుజురాబాద్ కరాటే విద్యార్థులు
ఆరు గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ విజయం
కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణానికి చెందిన కరాటే విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. కాజీపేటలోని ఏజీఆర్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో హుజురాబాద్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఆరు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించారు.గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కే. జలీల్ శిక్షణలో ఈ విద్యార్థులు ప్రతిభ కనబరచి జిల్లాకు గౌరవం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హుజురాబాద్ న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ప్రధాన అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. కరాటే మాస్టర్ జలీల్ కృషి ప్రశంసనీయం అని పేర్కొంటూ కరాటే శిక్షణతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత, సామాజిక స్పృహ, జాతీయ సమైక్యత వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెరిగి ధైర్యంగా ముందడుగు వేయాలని వారు అన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ గణేష్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ డైరెక్టర్ గోపాల్, మహాత్మ జ్యోతిరావు పూలే మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎం.డి. ఖలీద్ హుస్సేన్, గోస్కుల మధు, గోస్కుల నాగమణి, మైనార్టీ నాయకుడు ఎం.డి. తౌసిక్ తదితరులు పాల్గొన్నారు.



