బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడర్లు
హస్తం గూటికి తాజా మాజీ చైర్మన్, వైస్‌చైర్మన్
మున్సిపల్ ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామం
కాకతీయ, హుస్నాబాద్ : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హుస్నాబాద్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్‌చైర్మన్ అయిలేని అనిత రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు *భారత రాష్ట్ర సమితికు రాజీనామా చేసి **కాంగ్రెస్ పార్టీ*లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం హుస్నాబాద్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ చేరికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ స్థాయి నేతల చేరిక కాంగ్రెస్‌కు బలమని, హుస్నాబాద్ రాజకీయాల్లో కీలక మార్పులకు ఇది నాంది పలుకుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.



