భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ లో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. క్షణికావేశంలో భర్త చేసిన దాడికి ఓ భార్య బలైపోయిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వరంగల్ జిల్లా కాశీబుగ్గ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన అబ్బరబోయిన రాజు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. అతనికి భార్య అనిత (40)తో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం వీరిద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
కోపంతో ఊగిపోయిన రాజు, ఇంట్లో ఉన్న రోకలిబండను తీసుకుని భార్య అనిత తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయిన ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది.
సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు.
నిందితుడైన రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.


