గెలుపు గుర్రాల కోసం వేట
పరకాలలో మునిసిపల్ పోరు
మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం
చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయింపుతో గట్టి పోటీకి అవకాశం
పరకాల మున్సిపాలిటీపై కన్నేసిన కాంగ్రెస్
ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు
పూర్వ వైభవం సాధించేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు
ఉనికి చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు
ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
కాకతీయ, వరంగల్ బ్యూరో: పరకాల గడ్డపై మున్సిపల్ పోరు ఉత్కంఠ రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. చైర్మన్ పదవి ఈసారి జనరల్‌కు కేటాయించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్‌రావుకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయనే చెప్పాలి. పరకాలలో మొత్తం 22 వార్డులకుగాను మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు దామాషా ప్రకారం 11 సీట్లు దక్కాయి. జనరల్ మహిళ, బీసీ మహిళ, ఎస్సీ మహిళ కేటగిరీల్లో వార్డులు కేటాయించారు. దీంతో ఆశావహులు పోటీకి సన్నదమవుతున్నారు. చైర్మన్‌గా ఎంపికవడానికి అనుకూలమైన వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ దక్కించుకుంటే ఎన్నికల్లో సులభంగా విజయం సాధించవచ్చని ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. దీంతో వివిధ సర్వే సంస్థలతో మున్సిపల్ వార్డుల వారీగా ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఏ అభ్యర్థి అయితే సమర్ధుడు గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయో వారికి మాత్రమే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. పోటీ లేని చోట ఇప్పటికే కొందరికి సంకేతాలు ఇచ్చినప్పటికీ మిగిలిన చోట్ల వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయం
పరకాల కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ ఆపార్టీకి ఎన్నికల్లో నష్టం కలిగించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో కొత్త, పాత నేతల మధ్య దూరం ఇబ్బందికరంగా మారింది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకు గుర్తింపు దక్కడంలేదని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రశాష్‌రెడ్డి గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో విజయం సాధించడం ఎమ్మెల్యే రేవూరి పనితీరుకు పరీక్షగా మారనుంది. మరోపక్క .. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. ఇప్పటికే వార్డులవారగీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు
నిర్వహిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని చెబుతున్నారు.
చైర్మన్ పీఠంపై చల్లా దృష్టి
పరకాల మున్సిపాలిటీపై మరోమారు గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈమేరకు వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేరికలపై దృష్టిపెట్టిన ధర్మారెడ్డి .. కాంగ్రెస్ , బీజేపీ ల నుంచి నాయకులను బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పరకాల పట్టణంలోని 4, 16 వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పార్టీని వీడి పలువురు బీఆర్ఎస్‌లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. పరకాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ఇక బీజేపీ, స్వతంత్రులు కూడా పోటీకి సై అంటుండటంతో మున్సిపల్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.


