శివాలయంలో గుప్త నిధుల వేట
ఆలయ ప్రాంగణంలో రహస్యంగా తవ్వకాలు
పురాతన శిల్పాలకు నష్టం..
పోలీసుల విచారణ ప్రారంభం
కాకతీయ, నల్లబెల్లి : గుప్తనిధుల పేరుతో పురాతన దేవాలయంలో తవ్వకాలు చేపట్టడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామంలోని శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయన్న ప్రచారంతో కొందరు వ్యక్తులు జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. రేకుల షెడ్ నిర్మాణం పేరుతో పనులు ప్రారంభించినట్లు సమాచారం. గ్రామస్తుల కథనం ప్రకారం, తవ్వకాల సమయంలో ఆలయంలోని కొన్ని పురాతన శిల్పాలు తొలగించబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దలు, భక్తులు హెచ్చరించినప్పటికీ తవ్వకాలు ఆపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గుప్తనిధుల కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు చర్చ జరుగుతోంది. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా తవ్వకాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. గతంలో కూడా ఇదే ఆలయంలో ఇలాంటి తవ్వకాలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారుల చర్యలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


