విధుల్లో మానవత్వం…
ప్రమాద స్థలంలో ప్రాణ రక్షణకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవ
కాకతీయ, రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ట్రాఫిక్ గందరగోళం నెలకొంది. ఘటన సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.రాజేశ్వరరావు పరిస్థితిని వెంటనే సమీక్షించారు. రోడ్డు పై ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, గాయపడిన దంపతులకు తక్షణ సహాయం అందించారు. ఆలస్యం చేయకుండా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.
చట్టపరమైన చర్యలు కూడా
ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, డ్రైవర్‌ను గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విధుల్లో భాగంగా కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, మానవత్వంతో ప్రాణరక్షణకు ముందుకు వచ్చిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు చొరవను స్థానికులు హర్షాతిరేకాలతో ప్రశంసించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసులు ప్రజల భద్రతతో పాటు ప్రాణరక్షణలోనూ ముందుంటారనే నమ్మకం మరింత బలపడిందని స్థానికులు వ్యాఖ్యానించారు


