భీమేశ్వర స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం
15 రోజుల్లో రూ.1.15 కోట్లకు పైగా భక్తుల కానుకలు
కాకతీయ, వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం రూ.1,15,17,894గా నమోదైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో నగదు రూపంలో రూ.1.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100 గ్రాములు లభించినట్లు పేర్కొన్నారు. ఆలయంలో నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో రమాదేవి, కరీంనగర్ ఏసీ కార్యాలయ అధికారి రాజమౌళి సమక్షంలో చేపట్టారు.
ఈ లెక్కింపును ఆలయ ఇన్‌చార్జ్ ఏఆర్ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఏఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయికిరణ్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.


