భద్రాచలం ఆలయ అభివృద్దికి భారీగా నిధులు
ముఖ్యమంత్రి పెద్ద మనసుతో మంజూరు
రేపు పట్టణానికి సీఎం రేవంత్‌రెడ్డి
రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన
సీతారాముల కల్యాణానికి పటువస్త్రాలు..
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
శ్రీరామనవమి ఏర్పాట్లు పరిశీలన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీరాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొదటి దశలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు తెలంగాణ సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మొత్తం రూ.586 కోట్లతో రామాలయంతో పాటు భద్రాచలం పట్టణాభివృద్ధిని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని మిథిలా కళ్యాణ మండపం వేదికగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. శ్రీసీతారామచంద్రస్వామి దంపతులకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారని తెలిపారు. అందుకు శుక్రవారం భద్రాచలానికి సీఎం రేవంత్ వస్తున్నారన్నారు. ఆయనకు ప్రజల తరఫున ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్ పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరిలో నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పనులు చేపట్టినట్లు చెప్పారు. సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దేవాలయం అధికారులు, సిబ్బందికి మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.


