కోహెడ మార్కెట్ కమిటీకి భారీగా నిధులు
రూ.161 లక్షల అభివృద్ధి పనులకు పరిపాలన ఉత్తర్వులు
మంత్రి పొన్నం చొరవతో మంజూరైన నిధులు
కాకతీయ, హుస్నాబాద్ : సిద్ధిపేట జిల్లా కోహెడ మండల మార్కెట్ కమిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.161 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల్లో భాగంగా మార్కెట్ యార్డులో కవర్ షెడ్ నిర్మాణానికి రూ.101 లక్షలు, మార్కెట్ యార్డ్ ప్లాట్‌ఫాం నిర్మాణానికి రూ.47 లక్షలు, మార్కెట్ యార్డ్ భవనం పై అంతస్తులో చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరు చేశారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. కోహెడ మండల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఇంత భారీగా నిధులు రావడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల మంజూరుపై కోహెడ మండల మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యులు, రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.


