కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. రసాయన ఫ్యాక్టరీ పేరుతో అక్రమంగా మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా దొంగచాటుగా దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (ఎండీ డ్రగ్) ముడి రసాయనాలు స్వాధీనం కావడంతో సంచలనం రేపింది.
మహారాష్ట్రలోని మీరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు కొన్నాళ్లుగా ఓ అంతర్జాతీయ స్థాయి డ్రగ్ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టారు. గూఢచారులను రంగంలోకి దింపి వారాల పాటు రహస్యంగా సమాచారం సేకరించారు. దర్యాప్తులో ముఠా మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్న పక్కా ఆధారాలు దొరకడంతో పోలీసులు చర్లపల్లిలోని ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు.
‘వాఘ్దేవి ల్యాబ్స్’ పేరుతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీకి నకిలీ లైసెన్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. లోపల అత్యాధునిక పరికరాలతో పెద్ద ఎత్తున ఎండీ డ్రగ్ తయారు చేస్తున్నారు. దాడిలో ప్రాథమికంగా 100 గ్రాముల డ్రగ్, రూ.25 లక్షల నగదు స్వాధీనం చేశారు. అంతేకాకుండా 32,000 లీటర్లకు పైగా రసాయనాలు, భారీ ఉత్పత్తి యూనిట్లు సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్‌లో ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తానాజీ పాఠే, ఒక విదేశీయుడు సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రాష్ట్రాల మధ్య విస్తృతంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి.


