మూగజీవాలు నీరు తాగేదెలా?
కాకతీయ, శంకరపట్నం: మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలో మూగజీవాల దాహార్తి సమస్య తీవ్రరూపం దాల్చింది. గ్రామంలోని తడి చెత్త, పొడి చెత్త కాంపౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టె నిరుపయోగంగా మారడంతో పశువులకు తాగునీటి సమస్య తలెత్తింది. తొట్టె చుట్టూ చెట్లు ఏపుగా పెరిగి, శుభ్రత లేక పూర్తిగా నిర్వీర్యంగా తయారైంది. అదేవిధంగా నీటి సరఫరా నిలిపివేయడంతో పశువులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పశుకాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలు నీటి కోసం గ్రామమంతా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి తొట్టెను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రపరచి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకుని మూగజీవాల దాహార్తిని తీర్చేలా చూడాలని పశుకాపరులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి అవసరమైన చర్యలు తీసుకుంటేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


