మాకు చెప్పకుండా సర్వే ఎలా చేస్తారు
అధికారులను నిలదీసిన మానాల గ్రామస్థులు
అటవీ భూముల సర్వేపై మళ్లీ రగడ
సర్పంచ్ ఆగ్రహం.. గ్రామస్తుల నిరసన
కాకతీయ, వేములవాడ : సమాచారం ఇవ్వకుండా అటవీ భూముల సర్వే ఎలా చేపడతారని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. మానాల గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ సహా గ్రామస్తులు బీట్ ఆఫీసర్ మౌనిక బృందాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో అటవీశాఖ అధికారులు సర్వే చేపట్టేందుకు రావడంతో వివాదం తలెత్తింది. బీట్ ఆఫీసర్ మౌనిక ఆధ్వర్యంలో పలు టీంలు గ్రామంలోకి రావడంతో విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

పాత వివాదం మళ్లీ రగిలింది
గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా అధికారులను నిర్బంధించేందుకు కూడా గ్రామస్తులు యత్నించారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో అధికారులు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఉద్రిక్తత తాత్కాలికంగా చల్లారింది. మానాల గ్రామంలో అటవీ భూముల వివాదం గతంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. వేలాది ఎకరాల్లో నీలగిరి చెట్ల నరికివేత, భూములను చదును చేయడం, బోరుబావులు తవ్వడం, అక్రమ పట్టాలు ఇవ్వడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా గ్రామస్తులు అటవీ అధికారులను నిర్బంధించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడి చేసి సమస్య పరిష్కారం కోరారు. అయితే ఇచ్చిన హామీలు అమలు కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిని కాపాడే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. సమాచారం ఇవ్వకుండా సర్వేలు చేపట్టడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందని అంటున్నారు. ఈ వివాదం మళ్లీ ముదురే సూచనలు కనిపిస్తున్నాయి.


