ఏర్పాట్లెలా ఉన్నాయి?
ఇబ్బందులు ఎదురవుతున్నాయా?
వేములవాడలో భక్తులతో ముచ్చటించిన ఇంచార్జి కలెక్టర్
శివరాత్రి జాతర సౌకర్యాలపై గరిమ అగ్రవాల్ ఆరా
కాకతీయ, సిరిసిల్ల టౌన్: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తుల మధ్యకు వెళ్లిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తుల స్పందనను నేరుగా తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం కల్పించిన సౌకర్యాలు భక్తులకు ఎంత వరకు ఉపయుక్తంగా ఉన్నాయో ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఇతర చర్యలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా దర్శన క్యూ లైన్ వైపు వెళ్తున్న మహిళలతో కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. “జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా?” అంటూ ఇంచార్జి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భక్తులు స్పందిస్తూ, యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని, సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.


