కోతుల దాడితో గృహిణి మృతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద విషాదంగా మారింది. కోతుల గుంపు దాడి చేయబోతుండగా అడ్డుకునే ప్రయత్నంలో ఓ గృహిణి మెట్లపై నుంచి జారి పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల (50) బుధవారం ఉదయం ఇంటి ముందు పనులు చేస్తుండగా ఒక్కసారిగా కోతులు దూసుకొచ్చాయి. భయంతో వాటిని తరిమికొట్టే ప్రయత్నంలో అదుపుతప్పి ఇంటి మెట్లపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో లింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కోతుల ఆగడాలు నిత్యకృత్యంగా మారాయని, ప్రాణాలు పోతున్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని కోతుల బెడద నుంచి రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


