బీజేపీ నేతల హౌస్ అరెస్టులు
ఇది ప్రభుత్వ జులుం అంటూ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆగ్రహం
కాకతీయ, ఖిలావరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన సభను దృష్టిలో పెట్టుకొని, జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలపై పోలీసులు వరుసగా హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన అంటే ప్రతిపక్షాలకు హక్కులు ఉండవా? బీజేపీ నేతలంటే ప్రభుత్వానికి ఎందుకు అంత వణుకు వస్తోందో చెప్పాలన్నారు. ఈసందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ “ప్రజా పాలన పేరుతో ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకురావడం ఏమిటి? గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది,” అని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్బంధాలు ప్రభుత్వo బీజేపీ నేతలపై జులుం చేయడం సహించేదిలేదని రవికుమార్ స్పష్టం చేశారు. “కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పటం ఖాయం,” అని ఆయన హెచ్చరించారు.


