ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలి
నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి
లేనిపక్షంలో ప్రజాపోరాటాలకు సిద్ధం : సీపీఐ హెచ్చరిక
కాకతీయ, మరిపెడ : మరిపెడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మరిపెడలో మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆసుపత్రిని ఆదర్శవంతంగా నిర్మించాలని సూచించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం ప్రస్తుతం ఇరుకుగా ఉండటంతో కనీసం 30 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రికి చెందిన భూమి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని, దానిని వెంటనే స్వాధీనపరుచుకోవాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా స్థాయికి మించిన సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, నాయకులు లింగన్న, అంజి తదితరులు పాల్గొన్నారు.


