కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!
కోయంబత్తూరులో క్రూరహత్య
ముగ్గురు పిల్లల తల్లిని కిరాతకంగా నరికి చంపిన భర్త
భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్
కాకతీయ, క్రైమ్: తమిళనాడులోని కోయంబత్తూరులో భయంకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం, కోపం, అసహనం చివరకు రక్తపాతానికి దారితీసిన ఈ ఘటనలో భర్త చేసిన కిరాతకానికి యావత్ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. భార్యను నరికి చంపడమే కాకుండా, ఆమె మృతదేహం పక్కనే కూర్చుని సెల్ఫీ తీసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం ఈ ఘటనను మరింత దారుణంగా మార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తిరునెల్వేలికి చెందిన బాలమురుగన్ మరియు శ్రీప్రియ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. నిత్యం గొడవలు, మాటల తగాదాలు పెరగడంతో శ్రీప్రియ భర్త నుంచి దూరంగా ఉంటూ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే ఓ మహిళల హాస్టల్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే భర్త బంధువు ఇసక్కి రాజాతో శ్రీప్రియకు పరిచయం ఏర్పడింది.
శ్రీప్రియతో దిగిన ఫోటోను రాజా తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టగా.. ఈ ఫోటోను చూసిన బాలమురుగన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. రాజాతో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆ అనుమానమే నిండి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం మాట్లాడాలి అన్న నెపంతో హాస్టల్‌కు వచ్చిన బాలమురుగన్, బట్టల్లో దాచుకున్న కొడవలిని బయటకు తీసి భార్యపై దాడి చేశాడు. అక్కడికక్కడే నరికి చంపేశాడు. కానీ అతని క్రూరత్వం అక్కడితో ఆగలేదు.
రక్తపు మడుగులో పడి ఉన్న భార్య మృతదేహం పక్కన కూర్చొని సెల్ఫీ తీసుకుని, “నమ్మక ద్రోహానికి ప్రతిఫలం మరణం’’ అనే క్యాప్షన్‌తో తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. ఈ క్రూరహత్యతో హాస్టల్‌లో ఉన్న మహిళలు భయంతో బయటికి పరుగులు తీశారు. నిందితుడు మాత్రం అక్కడే ప్రశాంతంగా కూర్చొని, పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న రత్నపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలమురుగన్‌ను అరెస్టు చేశాకె, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కోయంబత్తూరులో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.


