నిజాయితీపరుడు సంతోష్‌ను బారీ మెజారిటీతో గెలిపించాలి
మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి
కాకతీయ, ములుగు ప్రతినిధి : నిస్వార్థపరుడు, నీతి,నిజాయితీకి ప్రతీక అయిన టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ ఫుట్ బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం ఆయన సర్పంచ్ అభ్యర్థి సంతోష్‌తో కలిసి మల్లంపల్లి గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని,ఇప్పటి వరకు గ్రామాన్ని పట్టించుకోని వారు ఎన్నికల ముందురోజు రోడ్లు, డ్రైనేజీ, గుడులు కడతామంటూ హామీలు ఇవ్వడం విడ్డూరం అని, ఇది ప్రజలను మోసం చేసే ప్రయత్నం మాత్రమే అని విమర్శించారు. గ్రామ సమస్యలన్నింటిపైనా పూర్తి అవగాహన కలిగిన అభ్యర్థి సంతోష్ మాత్రమే అని, అతడిని గెలిపిస్తే మల్లంపల్లి అభివృద్ధి వేగవంతమవుతుంది అని, పారదర్శకత, ప్రజాప్రయోజనాలు, సేవాభావం ఉన్న నాయకత్వం గ్రామానికి అత్యవసరంగా ఉంది అని అన్నారు. సంతోష్ గెలుపు ద్వారా మల్లంపల్లిలో ఉన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించి, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, మాజీ సర్పంచ్ చందర్ కుమారస్వామి, రాష్ట్ర నాయకులు బత్తోజు ద్రోణాచారి, మాజీ ఎంపిటిసి మాచర్ల ప్రభాకర్, యువజన నాయకులు మొర్రి రాజు యాదవ్, మహమ్మద్ చోటు, జిల్లా యూత్ అధికార ప్రతినిధి రేణికుంట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.



