ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న హోంగార్డ్
సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన లేక్ పోలీస్ సిబ్బంది
కాకతీయ, కరీంనగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కరీంనగర్ లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన సాంబారి మధు (25) కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై (ఎల్‌ఎండీ) పై నుంచి దూకేందుకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు డయల్–100కు సమాచారం అందించారు. కంట్రోల్ రూమ్ సమాచారం మేరకు వెంటనే స్పందించిన లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ హోంగార్డ్ ఎం నారాయణ డ్యామ్‌పై గాలింపు చేపట్టి యువకుడిని అడ్డుకుని సురక్షితంగా కాపాడారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని హితవు పలికారు. తరువాత యువకుడిని అతని బంధువులకు అప్పగించారు.
సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన హోంగార్డ్‌ను ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు.


