- పదేళ్లు అన్యాయం చేసి ఇప్పుడు మొసలి కన్నీరా ?
- రాజకీయ పబ్బం కోసం… ప్రచారం కోసం డ్రామాలొద్దు
- నీ రాజకీయం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు
- నిరుద్యోగులు కవిత మాయలో పడొద్దు ..
- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ జీవితం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని.. కవిత మాయలో నిరుద్యోగులు పడొద్దని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. నాడు నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు కవిత ఏం చేసింది. ఎక్కడుంది…? కనీసం నిరుద్యోగుల కోసం ఒక్క మాట మాట్లాడని కవిత… ఇప్పుడు వారికోసం దీక్షలు చేస్తాననడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం ఆనాడు పోరాడింది మేమే.. ఈనాడు వారికి న్యాయం చేస్తున్నది మేమే అన్నారు. వంటా వార్పు క్రాస్ రోడ్డులో కాదు, మీ బాపు ఫామ్ హౌజ్ ముందు చేయాలన్నారు. పేపర్లు అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వాళ్ల ఇంటి ముందు ధర్నాకు దిగాలని సూచించారు. ఇవాళ రాజకీయ పబ్బం కోసం…ప్రచారం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హితవు పలికారు.
రెచ్చగొడుతున్న కోచింగ్ సెంటర్లు..
కోర్టు ఆదేశాల మేరకు.. గ్రూప్ 1 పరీక్ష పకడ్భందీగా నిర్వహించి, నియామకాలు పూర్తి చేసిన ప్రజా ప్రభుత్వంపై కవిత ఆడిపోసుకోవడం దారుణం అన్నారు. కోచింగ్ సెంటర్ల యజమానులు కొందరు కవిత తో కలిసి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే 60 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని, ప్రస్తుతం కొన్ని శాఖలు నోటిఫికేషన్లు కూడా ఇచ్చాయన్నారు. భవిష్యత్తులో అనేక నోటిఫికేషన్లు రాబోతున్నాయని వెంకట్ తెలిపారు. నిరుద్యోగులంతా రాజకీయ కుట్రలకు దూరంగా ఉంటూ పరీక్షల కోసం సన్నద్దం కావాలని వెంకట్ కోరారు.


