కాకతీయ, పరకాల: బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామం, అమరవీరుల స్మారక భవనం యందు నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం స్వాతంత్ర సమరయోధులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగఫలం రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైన తెలంగాణ సెప్టెంబర్ 17 శుభదినం రోజున జరుపుకుంటున్న ప్రజా పాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నిజాం పాలనపై రజాకర్ల దురాగతాలపై సైనిక చర్యగా జరిపి, యుద్ధంలో నిజాం ను ఓడించి తెలంగాణకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించారని అన్నారు. పరకాల గడ్డ చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతమని అమరుల త్యాగం మరవలేనిదాని అన్నారు. పరకాల అమరుల చరిత్ర ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అదేవిధంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ ప్రజలు నయా నిజాం (కేసీఆర్) నిరంకుశ పాలనను అంతమొందించి, ప్రజా పాలన తీసుకువచ్చిన సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు.
రైతులు, మహిళలు, యువకుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు.కాంగ్రెస్ పాలనలో పేదలకు సన్న బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్ లు, వడ్డీ లేని రుణాలు, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, ఏసీపీ సతీష్ బాబు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.


