- ధర్మరక్షణే మన కర్తవ్య మార్గం
- సమరసతతో సమాజానికి శాంతి
- సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్
- నగరంలో అయ్యప్ప అన్నప్రసాద వితరణ ప్రాంగణం ప్రారంభం
కాకతీయ, ఖమ్మం సిటీ: హిందుత్వమే భారతదేశపు ఆత్మ అని, ధర్మరక్షణే మన కర్తవ్య మార్గమని, సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ఉద్ఘాటించారు. ధర్మరక్షణ అంటే కత్తి పట్టడం కాదని, సత్యాన్ని నిలబెట్టడం అని ఆయన స్పష్టం చేశారు. మనిషి తనలోని చెడు ప్రవృత్తులను జయించి, పరమాత్మ సన్నిధిలో నిజాయితీగా నిలబడడమే ధర్మరక్షణ అని ఆయన అన్నారు. నగరంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి మార్గదర్శకత్వంలో తాండ్ర మంజుల సేవా ట్రస్ట్ నిర్వహణలో ఏర్పాటైన అయ్యప్ప అన్నప్రసాద వితరణ ప్రాంగణం 17వ వసంతంలోకి అడుగుపెట్టినది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి అప్పాల ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హిందుత్వం అనేది మతపరమైన పదం కాదని, అది మన సంస్కృతి, మన చరిత్ర, మన నాడీ అని అన్నారు. హిందూ అంటే కేవలం ఆచారంలో ఉండేవాడు కాదని, ఆలోచనలో, ఆత్మలో భారతీయతను మోసేవాడని ఆయన అన్నారు. హిందువులు ఏకమైతే ఏదీ అసాధ్యం కాదని, ఐక్యతలోనే శక్తి ఉందని పిలుపునిచ్చారు.
సనాతన సంస్కృతిని రక్షించాలంటే ముందుగా హిందువులు తమలోని చిన్నచిన్న విభేదాలను విడిచిపెట్టాలని కోరారు. అన్నప్రసాద వితరణ ప్రాంగణం ప్రారంభం సందర్భంగా తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి మాట్లాడారు. అయ్యప్ప భక్తుల ఐక్యతే ఈ సేవా కార్యక్రమానికి ప్రాణం అని, భక్తుల కృషితోనే 17 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతోందని, అన్నదానం అనేది భక్తికి ప్రతిరూపమని అన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ ప్రాంగణాన్ని ప్రారంభించి అయ్యప్ప పూజ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షుడు రాజ్ దేశ్ పాండే, బొమ్మన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, ఏ ఎస్ ఏ డి పి ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ గురుస్వామి, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు గురుస్వామి, తెలంగాణ శబరిమల అనంతగిరి ఆలయ చైర్మన్ కొండపల్లి వాసు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమ అనంతరం ముఖ్య అతిథులను సన్మానించారు.


