కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మరోసారి జరిగాయి. గవర్నర్ వద్ద బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం జీవో జారీ చేయడం సరైందా? అనే అంశంపై న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తుచేస్తూ, ఈ విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.
అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరుతూ.. దసరా సెలవుల తర్వాతే వాదనలు వినిపించేందుకు వీలు కల్పించండి అన్నారు. దీనిపై హైకోర్టు, తదుపరి విచారణను అక్టోబర్ 8కి కేసు వాయిదా వేసింది . అంతవరకు ఈ విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు ముఖ్య వ్యాఖ్యలు చేసింది. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశిస్తే, కేసును మీరు చెప్పినప్పుడు వింటామని కోర్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం తీసుకుని సమాధానం ఇస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఇచ్చే తుది తీర్పు రాబోయే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


