కాకతీయ, నేషనల్ డెస్క్: కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కుట్ర కోణం ఉందని స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ ఆ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైతున్నట్లు సమాచారం. ర్యాలీ జరుగుతుండగా రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకున్నట్లు టీవీకే వెల్లడించింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సోమవారం మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై విచారణను ప్రత్యేక దర్యాప్తు బ్రుందం లేదా సీబీఐకి అప్పగించాలని కోరనున్నట్లు టీవీకే అడ్వకేట్ అరివళగన్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఘటనలో కుట్ర కోణం ఉండదనేందుకు స్థానిక ప్రజల నుంచి తమకు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి కొన్ని సీసీటీవీ ద్రుశ్యాలు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా ర్యాలీలో నిబంధనలను ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. గత రెండు నెలలుగా పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించగా..ఎక్కడా కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదన్నారు. కానీ కరూర్ లోనే తొక్కిసలాట జరగడంపై అనేక సందేహాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
కాగా ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. విజయ్ ప్రసంగిస్తుండగా కొందరు ఒక్కసారిగా సమీపానికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఈ దర్ఘటన జరిగింది.


