కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లన్నింటినీ ఒకే సారి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే పిటిషన్లు, వ్యతిరేకించే పిటిషన్లు అన్నీ ఒకే దశలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 9 ప్రకారం బీసీల రిజర్వేషన్ శాతం 25 నుంచి 42కు పెరిగింది. దీంతో మొత్తం రిజర్వేషన్ల శాతం 67కు చేరిందని, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన 50 శాతం పరిమితిని మించిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బి. మాధవరెడ్డి, ఎస్. రమేశ్ సహా పలువురు పిటిషనర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేశారు.
ప్రభుత్వ తరఫున రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టబద్ధం చేయడానికి పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285Aలో సవరణలు చేసినట్టు అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి తెలిపారు. అయితే, ఆ సవరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇంకా లభించలేదని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు.
ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై ఉండగా, ఆ కేసును హైకోర్టు పరిధిలోనే పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విషయం ధర్మాసనం గుర్తుచేసింది.
రాజకీయంగా కూడా ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు, ఇందిరా శోభన్, చరణ్ కౌశిక్ తదితరులు కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఇప్పటికే అక్టోబర్-నవంబర్ నెలల్లో ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, ఈ విచారణ ఫలితం ఆ ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.


