- అడ్డు చెబితే రిజర్వేషన్లు మారే అవకాశం !
- జీవోను కొట్టేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది ?
- ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడుతాయా ?
- ఇప్పటికే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు
- చాలా చోట్ల సీనియర్ నేతల అసంతృప్తి
- సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అందరి చూపు హైకోర్టు వైపే..
- స్థానిక ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ రిలీజ్..
- తొలి విడత ఎన్నికల కోసం ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ ..
- లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయా? మళ్లీ అటకెక్కుతాయా ? అని రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఓవైపు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎన్నికలు జరుగుతాయా ? కోర్టు జోక్యంతో వాయిదా పడుతాయా ? రిజర్వేషన్లు మారుతాయా..? అనే ఉత్కంఠ నేతలతోపాటు సామాన్యుల్లోనూ నెలకొంది. బీసీలకు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించటంతో ఎన్నికలపై అనిశ్చితి కొనసాగుతోంది. కాగా, రిజర్వేషన్ల అంశం హైకోర్టులోనే తేల్చుకోవాలని నిన్న సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఆశావహులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక రేపు .. హైకోర్టులో విచారణ సందర్భంగా ఎలాంటి తీర్పు వస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ప్రస్తుత రిజర్వేషన్లు తారుమారు కానున్నాయి. బీసీ సీట్లు తగ్గటంతోపాటు జనరల్ సీట్లు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ఆశావాహ అభ్యర్థుల్లో, సామాన్యుల్లో ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతున్నది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది..? ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది.
మార్గదర్శకాలకు విరుద్ధంగా..
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా స్థానిక రిజర్వేషన్లను ఖరారు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు.. మొత్తంగా 67% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ఇది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌ను మించిపోతున్నది. పైగా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం వాటి అమలు కోసం జీవోను విడుదల చేసింది. ఇలా ఎటుచూసినా ఈ రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని న్యాయకోవిదులు స్పష్టంగా తేల్చిచెప్తున్నారు. మరోవైపు బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రిజర్వేషన్ల ఖరారుతో జోష్
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఇటీవల షెడ్యూల్ ప్రకటించింది. తొలి విడత ఎన్నికల కోసం ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటితోపాటు ఎంపీటీసీలు, గ్రామపంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్లను ఖరారయ్యాయి. ఈ రిజర్వేషన్లతో బీసీలకు భారీ సంఖ్యలో పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో గ్రామాలు, మండలస్థాయిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొత్తగా ఖరారైన రిజర్వేషన్లతో ఆశావహులు చాలామంది అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎవరనే చర్చ ప్రజల్లో మొదలైంది. ఎవరెవరు బరిలో ఉంటన్నారు..? ఎవరు గెలిచే అవకాశాలున్నాయని ఆరా తీస్తున్నారు.
ఆశావహుల్లో ఆందోళన
స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే జడ్పీటీసీ స్థానానికి పోటీ పడే ముగ్గురు పేర్లతో జాబితాను అధిష్ఠానానికి పంపింది. ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఎంపిక చేయనున్నారు. మరోవైపు మెజారిటీ జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని గులాబీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇక బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. 15 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని లెక్కలు వేసుకుంటోంది. మూడు ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లు ఉంటాయా..? ఉండవా..? అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు.
రిజర్వేషన్ల ఝలక్
పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు తమ అదృష్టాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రధానంగా జనరల్, బీసీ కోటాలో పాగా వేయాలని ఆశించిన నేతలకు జడ్పీ చైర్మన్ పదవులు మింగుడు పడటంలేదు. అంతేగాక జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు కూడా రిజర్వేషన్లు కలిసి రాకపోవటంతో అనేక మంది నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42శాతం రిజర్వేషన్లపై కొందరు కోర్టును ఆశ్రయించటంతో వీరిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏదైనా జరిగుతే తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మారుతాయనే ఆశతో కొందరు నేతలు ఉన్నారు.
కోర్టు తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెంచిన రిజర్వేషన్లకు కోర్టు బ్రేకులు వేస్తే ఎలా అనే చర్చ నడుస్తోంది. తీర్పును మరో తేదీకి వాయిదా వేస్తే.. తుది తీర్పు వచ్చే దాకా ప్రభుత్వం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఒక వేళ కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఎన్నికలకు వెళ్తే.. ఆ ఎన్నికలు సైతం కోర్టు రద్దుచేయొచ్చని, మహారాష్ట్రలో ఇలాంటి సంఘటనే జరిగిందని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొంటున్నారు. సాంకేతికంగా సాధ్యం కాకుంటే ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారడం తప్పనిసరిగా కనిపిస్తోందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బీసీలకు మళ్లీ పాత రిజర్వేషన్లే దిక్కయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చననే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభావం ఉండటంతో అందరి దృష్టి అటువైపే పడింది.


