ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హై అలర్ట్
ఓరుగల్లు కోట వద్ద పోలీసుల ‘రిక్కీ’
కాకతీయ, ఖిలావరంగల్: ఖిలావరంగల్ కోట లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రత్యేక దళం ఆక్టోపస్ బృందం చారిత్రక ఓరుగల్లు కోట పరిసరాల్లోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రిక్కీ (ముందస్తు నిఘా) నిర్వహించింది.
అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు 25 మంది సభ్యులతో కూడిన ఈ బృందం వరంగల్ కోట, వేయి స్తంభాల ఆలయం సహా ప్రధాన దేవాలయాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, భౌగోళిక పరిస్థితులను సవిమర్శగా పరిశీలించింది.
కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏకశిలగుట్ట, ఖుష్ మహల్, స్వయంభు దేవాలయాల మధ్య ఉన్న పురాతన కళాఖండాలు, కళాతోరణాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి రూట్ మ్యాప్, బలహీన ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఈ రిక్కీ కార్యక్రమానికి పురావస్తు శాఖ ఖిలావరంగల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, పర్యాటక శాఖ నియమించిన గైడ్ రవి యాదవ్ సహకారం అందించారు. కాకతీయుల చరిత్ర, శిల్పకళా వైభవాన్ని పోలీసులకు రవి యాదవ్ వివరించారు.


