హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు హత్య
చికిత్స కోసం విజయవాడ వస్తే అరెస్టు చేశారు
మూడు రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారు
లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు
ఈ కుట్రలో ఏపీకి చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర
మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో విడుదల
హిడ్మా, శంకర్ ఎన్‌కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్
హిడ్మా హత్యకు దేవ్‌జీ కారణమన్న ప్రచారాన్ని ఖండించిన మావోయిస్టు పార్టీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. హిడ్మాతోపాటు శంకర్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిడ్మా కదలికల గురించి లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని, ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర ఉందని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్లినట్లు చెప్పారు. మూడు రోజులపాటు చిత్రహింసలకు గురిచేసి ఆంధ్రా పోలీసులు చంపేశారని ఆరోపించారు. హిడ్మా, శంకర్ ఎన్‌కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ లేఖలో స్పష్టం చేశారు. హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇది పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమని పేర్కొంది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, విప్లవోద్యమానికి అండగా నిలవాలని పిలుపునిచ్చింది.
కీల నేతలు హతం
కాగా.. గత నెలలో (నవంబర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మాతోపాటు ఆయన భార్య రాజే, పలువురు అనుచరులు హతమవ్వగా, నవంబర్ 19న జరిగిన ఎన్‌కౌంటర్‌లో శంకర్ సహా ఆరుగురు మృతి చెందారు. ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ఘటనా స్థలంలో దొరికిన డైరీలోని సమాచారం ఆధారంగా ఏపీలోని పలు జిల్లాల్లో తనిఖీలు చేసి దాదాపు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.


