మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్2 గో..
కిలోమీటర్‌కి 90 పైసలే!
ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో దుమ్ము రేపే లాంచ్..
విడా వీఎక్స్2 గో ధర, ఫీచర్లు ఇవే!
కాకతీయ, ఆటోమొబైల్ : దేశంలోని ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ మరోసారి ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగులు వేస్తోంది. ఇప్పటికే “విడా” బ్రాండ్ కింద పలు ఈ-స్కూటర్లు విడుదల చేసిన హీరో, ఇప్పుడు విడా వీఎక్స్2 గో (Vida Vx2 Go) అనే కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. టెక్నాలజీ, మైలేజ్, ఫీచర్ల పరంగా ఇది నేటి యువత అంచనాలకు సరిపోయేలా ఉందని కంపెనీ చెబుతోంది.
ఇప్పటి వరకు విడా వీఎక్స్2 ప్లస్ వేరియంట్‌లో మాత్రమే 3.4kWh బ్యాటరీ ఆప్షన్ లభించేది. ఇప్పుడు అదే సామర్థ్యం గల బ్యాటరీతో వీఎక్స్2 గోని అందుబాటులోకి తెచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.02 లక్షలుగా నిర్ణయించారు. డెలివరీలు ఈ నెల నుంచే ప్రారంభమవుతాయని హీరో మోటోకార్ప్ ప్రకటించింది.
ఈ కొత్త స్కూటర్‌కి కంపెనీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. “బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్” మోడల్‌లో కొనుగోలు చేస్తే స్కూటర్ ధర కేవలం రూ. 60 వేలకే దిగి వస్తుంది. అయితే, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 90 పైసల సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. ఈ విధానం వల్ల కస్టమర్‌పై మొదటి దశలో భారీ ఖర్చు పడకుండా చూసింది హీరో.
విడా వీఎక్స్2 గోలోని మోటార్ 6kW పవర్, 26Nm టార్క్ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు. రోజువారీ ప్రయాణాలకు ఇది సరైన పరిష్కారం అవుతుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఈ స్కూటర్ మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, రిమూవబుల్ బ్యాటరీలు కలిగి ఉండటం. అంటే ఇంట్లోనే లేదా కార్యాలయంలో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల అవసరం తగ్గిపోతుంది.
కాగా, హీరో మోటోకార్ప్ “విడా” సిరీస్ ద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూకుడుగా ముందుకెళ్లాలని చూస్తోంది. ఫ్యూచర్ మొబిలిటీగా ఈ-స్కూటర్లు వేగంగా పెరుగుతున్న సమయంలో, విడా వీఎక్స్2 గో లాంటి లాంచ్‌లు కంపెనీకి కొత్త బలాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు.


