ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి
హుజురాబాద్ ఎంవీఐ కంచి వేణు
కాకతీయ, జమ్మికుంట : రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కంచి వేణు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం–2026 సందర్భంగా గురువారం జమ్మికుంటలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని అన్నారు. నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించాలి అని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు. ప్రతి వాహనదారుడికి తన ప్రాణం ఎంత ముఖ్యమో, ఎదురుగా వచ్చే వ్యక్తి ప్రాణం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడమేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా అతివేగం నివారించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై నినాదాలు చేశారు.
యువత భాగస్వామ్యంతో అవగాహన
బైక్ ర్యాలీలో యువత, విద్యార్థుల భాగస్వామ్యం ఉండటం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కంచి వేణు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తస్మా నాయకులు తిరుపతి రెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ కత్తులు నాగరాజు, బుర్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు.


