కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
వాయవ్యబంగాళాఖాతంలో రానున్న 12గంటల నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనిప్రభావంతో తెలంగాణతోపాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు మరింత ప్రభావం చూపే అవకాశముందని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేని సందర్భాల్లో బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ రంగం కూడా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.


