కాకతీయ, నేషనల్ డెస్క్: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. భారత వాతావరణ సంస్థ సైతం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు 250కిపైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు తెలిపారు అధికారులు. ఉదయం 9గంటల నుంచి 9.50గంటల ప్రాంతంలో 8 విమానాల దారి మళ్లించినట్లు తెలిపారు.
విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎయిర్ పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ కూడా జారీ చేశారు. విమానాల సమయాలను సంబంధిత వెబ్ సైట్లలో చెక్ చేసుకోవాలని ఎయిర్ పోర్టు అథారిటీ సూచించింది.
పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేస్తూ..వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించాయి. మరోవైపు భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా స్కూల్స్, కాలేజీలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్ఱం హోం చేసుకోవాలని సూచించింది. అవసరం అయితేనే తప్పా ప్రజలు బయటకు రావద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విజ్నప్తి చేసింది.


