కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్‌లో ఘోరం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోకి కత్తి పట్టుకొని దూసుకెళ్లి, విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, రాత్రి 10 గంటల సమయంలో నిందితుడు నేరుగా ఎస్ఐ గదికి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ టి. నారాయణ అతన్ని అడ్డుకోవడంతో, నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపు పైభాగంలో పొడిచాడు.
ఈ ఘటనను చూసిన హోం గార్డ్ గిరిధారి వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడిని బలంగా తోసేయడంతో ఆయన చేతులకు గాయాలయ్యాయి. వారి కేకలు విన్న మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుకవైపు ఉన్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు.
గాయపడిన హెడ్ కానిస్టేబుల్ నారాయణ, హోంగార్డ్ గిరిధారిలకు స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు ప్రాథమిక విచారణలో దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వలసదారుడని భావిస్తున్నారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు వెదుకుతున్నాయి. ఈ దాడి ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్‌లోనే విధి నిర్వర్తిస్తున్న సిబ్బందిపై దాడి జరగడంతో భద్రతా లోపాలపై చర్చ మొదలైంది. పోలీసులు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.


