ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
రైతులు ఎకరానికి రూ. 30 వేలు నష్టపోతున్నారు
అదనంగా బోనస్ ఇచ్చి క్వింటల్ రూ. 2800 కొనుగోలుచేయాలి
రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలి
మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కాకతీయ, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలను తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకర్గంలోని వేల్పూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేముల మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చిందని, దాదాపు 60 శాతం పంట కోయడం జరిగిందన్నారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు 1800 లకు కూడా కొనడం లేదన్నారు. ప్రైవేట్ వ్యాపారులు 2000 లకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800 కూడా కొనడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రవేట్ వ్యాపారులు ధర ఇంకా తగ్గించి 1600 లకు కొనే దుస్థితి వస్తుందన్నారు. వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధర 400 కలిపి 2800 కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అన్నదాతను ఆదుకోవాలి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2800 లకు మక్క పంట కొనాలి…కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వల్ల ప్రస్తుతం ప్రవేట్ వ్యాపారులు ఇస్తున్న ధరతో రైతు ఎకరానికి 1000 రూపాయలు నష్టపోతున్నాడు. ప్రతి ఎకరానికి 30 క్వింటాల్ పంట వచ్చిన ఎకరానికి రూ.30 వేల మక్క పండించే రైతు నష్టపోతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంట వెంటనే కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుని డిమాండ్ చేశారు. రూ. గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోయాపంట కడా చేతికోస్తుంది.. ప్రభుత్వం ఇప్పటినుండే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న పంట కొనుగోలు కు ఏర్పడిన పరిస్థితులు సొయా పంటకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని వేములు విజ్క్షప్తి చేశారు.


