‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు సీఎం అయ్యారు’
రేవంత్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు
సీఎం పదవి గౌరవాన్ని దిగజారుస్తున్నారని మండిపాటు
కేసీఆర్ స్థాయికి సరిపోవని హెచ్చరిక
ఇతరుల చావు కోరుకోవడం రండగాళ్ల పని అంటూ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు సీఎం పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని మండిపడ్డారు. “తంతే బూరెల బుట్టలో పడ్డట్లు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ పదవికి తగిన హుందాతనం ఆయనలో కనిపించడం లేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. రేవంత్ రెడ్డి తన ప్రవర్తనతో గల్లీ స్థాయి నాయకుడని మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. “నీకు ఒక భాషే వచ్చు.. మాకు అన్ని భాషలు వచ్చు. మేం కూడా నీ భాషలో మాట్లాడగలం. కానీ నీలాగా మాట్లాడటం మా సంస్కృతి కాదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌తో పోలికే అసంబద్ధం
కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడని ఆయన వ్యాఖ్యానించారు. “కేసీఆర్ స్థాయి ఏంటి.. నువ్వెక్కడ?” అంటూ ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని, పదవి మర్యాదను కాపాడుకోవాలని హెచ్చరించారు. ఇతరుల చావు కోరుకోవడం అనేది రండగాళ్లు చేసే పని అంటూ జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రజలు అన్నీ చూస్తున్నారు. వచ్చే జనరల్ ఎన్నికల్లో ప్రజలే నిన్ను తీర్పు చెబుతారు” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మాటల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజకీయంగా మరింత ఎదురుదాడికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.


