ఆర్చరీలో సత్తా చాటిన హర్షిత
అభినందించిన ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామానికి చెందిన కోట హర్షిత ఆర్చరీ పోటీల్లో మూడో స్థానం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా హర్షితను ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు శాలువా కప్పి ఘనంగా అభినందించారు. కోట శ్రీను–ఆదిలక్ష్మి దంపతుల కూతురైన హర్షిత గిరిజన ప్రాంతానికి చెందినప్పటికీ ఆర్చరీ క్రీడలో అసాధారణ ప్రతిభ కనబరిచి ఈ విజయం సాధించిందని లక్ష్మణ్ బాబు ప్రశంసించారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో సాధించిన ఈ విజయం ఆమెను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. లక్ష్యాన్ని ఖచ్చితంగా గురి పెట్టే ఆర్చరీ క్రీడాకారులు యువతకు ఆదర్శమని, హర్షిత విజయం మరెన్నో విజయాలకు నాంది కావాలని తెలిపారు. హర్షితకు అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏటూరునాగారం మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, జిల్లా నాయకులు తాటి కృష్ణయ్య, ఎండి. వలీబాబా, చిట్టిమల్ల సమ్మయ్య, యలవర్తి శ్రీనివాసరావు, కోట నరసింహులు, ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, పూజారి శ్రీనివాస్, కిరణ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


