కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల ఖర్చులు, ప్రయోజనాలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ నుండి మల్లన్నసాగర్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.84,000 కోట్లు కాగా, తమ్మిడి హెట్టి నుండి ఎల్లంపల్లి వరకు మాత్రమే రూ.35,000 కోట్లు ఖర్చు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉండగా, ప్రాణహిత-చేవెళ్లతో కేవలం 4.47 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందించాలనుకుంటున్నారు. కాళేశ్వరం నీటి వినియోగం 240 టి ఎం సి ఉంటే, ప్రాణహిత – చేవెళ్లలో అది 80 టి ఎం సి మాత్రమే. అయినా రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి, పదోవంతు ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని ఈ ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మూడో వంతు ఖర్చు పెట్టి, పదోవంతు ఎకరాలకు కూడా నీరు ఇవ్వని ఈ ప్రాజెక్టును అద్భుతం, అమోఘం అని మాత్రమే చెప్పాలి. ఇదేనా అసలైన మార్పు? అని ప్రశ్నించారు.


