కాకతీయ, హనుమకొండ : హన్మకొండ పోలీసులు, తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆపరేషన్‌లో గంజాయి స్మగ్లర్ల నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కుమార్పల్లి ఎస్ టి. జోసెఫ్ హైస్కూల్ సమీపంలో మహీంద్రా ఎక్స్ యూ వి కారులో గంజాయి తరలిస్తున్న నిందితులను టీ ఎస్ నాబ్ సీఐ శ్రీకాంత్, ఎస్‌ఐ పరశురాములు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 25 కిలోల 800 గ్రాముల ఎండుగంజాయి, ఐదు సెల్‌ఫోన్లు, మహీంద్రా ఎక్స్ యూ వి కారు, ప్యాకింగ్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి హన్మకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపించారు.
అరెస్టైన వారు.. కరీంనగర్ టౌన్‌కు చెందిన ఎండి. ఫైజాన్, ఎస్ డి. అన్సార్, ఎండి. అర్బాస్, ముగ్గురు, అలాగే హన్మకొండ కుమార్పల్లికి చెందిన అర్షద్ అలీ ఖాన్, వీరు ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు నుంచి బాలు అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తెచ్చి విక్రయానికి సిద్ధం అవుతున్న సమయంలో పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహరావు యువతకు హెచ్చరిక జారీ చేస్తూ, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడితే ఆరోగ్యంతో పాటు జీవితమూ నాశనమవుతుంది. ఇలాంటి అక్రమ కార్యకలాపాల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి అని అన్నారు.


