లక్ష రూపాయల బ్యాగు అప్పగింత
కాకతీయ, పాలకుర్తి : పోగొట్టుకున్న లక్ష రూపాయల నగదు ఉన్న బ్యాగును గుర్తించి యజమానికి అప్పగించి పాలకుర్తి పోలీసులు మానవత్వానికి మారు పేరుగా నిలిచారు. సీసీ కెమెరాల ఆధారంగా బ్యాగును గుర్తించి, పూర్తిస్థాయిలో నగదు, పత్రాలు అప్పగించడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. రేగుల గ్రామానికి చెందిన ముత్యం యాకయ్య జనగామ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం విధి నిర్వహణ నిమిత్తం డ్యూటీకి వెళ్తుండగా మార్గమధ్యలో లక్షా రెండు వేల రూపాయల నగదు, ఐడీ కార్డు, ఇతర విలువైన పత్రాలు ఉన్న బ్యాగును పోగొట్టుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ను ఆశ్రయించాడు. ఎస్‌ఐ పవన్‌కుమార్ ఆదేశాలతో ఎస్‌ఐ లింగారెడ్డి, హోంగార్డు మారయ్య రంగంలోకి దిగారు. దర్దేపల్లి గ్రామ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, యాకయ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో బ్యాగు జారిపడినట్లు గుర్తించారు. వెంటనే బ్యాగును స్వాధీనం చేసుకుని అందులోని లక్షా రెండు వేల రూపాయల నగదు, ఐడీ కార్డులు, పత్రాలను యాకయ్యకు అప్పగించారు. బ్యాగు తిరిగి అందుకున్న ముత్యం యాకయ్య మాట్లాడుతూ, డ్యూటీకి వెళ్తూ పోగొట్టుకున్న డబ్బులు తిరిగి లభించడం ఆనందంగా ఉందన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా చాకచక్యంగా వ్యవహరించి బ్యాగును గుర్తించి అప్పగించిన పాలకుర్తి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ పవన్‌కుమార్, ఎస్‌ఐ లింగారెడ్డి, కానిస్టేబుల్ రవి, హోంగార్డు మారయ్యలను అభినందించారు. ప్రజల ఆస్తి రక్షణలో పోలీసుల నిబద్ధతకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందని స్థానికులు ప్రశంసించారు.


