సరిహద్దుల్లో తుపాకుల మోత…
కర్రెగుట్ట అడవుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి
‘ఆపరేషన్ కగార్–2’లో కూంబింగ్ ఉధృతి
అగ్రనేతల వేటలో ప్రత్యేక దళాలు
మార్చి 31 లక్ష్యానికి కౌంట్‌డౌన్
కాకతీయ, ఏటూరునాగారం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మరోసారి తుపాకీ మోతలతో మార్మోగింది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్రం చేపట్టిన “నక్సల్ రహిత భారత్” లక్ష్యంలో భాగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్–2’లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గూఢచారి సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలు లోతట్టు ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల్లో కీలక అగ్రనేతలు ఉండే అవకాశముందని భావిస్తున్నప్పటికీ, అధికారిక గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
అగ్రనేతలే టార్గెట్
మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది, బడే చొక్కారావును లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను తీవ్రతరం చేసినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దండకారణ్య ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నాయకుల కదలికలపై నిఘా పెంచిన బలగాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.
భారీ బలగాల మోహరింపు
ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో సుమారు ఐదువేల మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, కోబ్రా కమాండోలు, గ్రేహౌండ్స్ ప్రత్యేక దళాలు, జిల్లా రిజర్వ్ గార్డు బలగాలు సరిహద్దు అడవుల్లో మోహరించాయి.
గడువు సమీపంలో
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్దేశించిన మార్చి 31, 2026 గడువు దగ్గరపడుతోంది. దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్‌లు వేగవంతం చేశారు. గడువుకు కేవలం నలభై రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అడవుల్లో బలగాల పట్టు మరింత కఠినమవుతోంది.
సరిహద్దు ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని ఎదురుకాల్పులు జరిగే అవకాశముండటంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. అధికారిక ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారు.


