*‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం అవ్వండి
*పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలం
*పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోండి
*గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్ – దుబాయి 2025’లో భాగంగా యూఏఈలో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డు(సైబా)ల ప్రదానోత్సవానికి ఆయన అతిథిగా హాజరయ్యారు.
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణ పురోగతిని, భవిష్యత్ ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘భౌగోళిక విస్తీర్ణంలో 11, జనాభా పరంగా తెలంగాణ 12వ స్థానంలో ఉంది. అయినా… దేశ జీడీపీలో మా వాటా 5 శాతం కంటే ఎక్కువే. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. గత 18 నెలల్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఈవీ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఏఐ, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది’ అని చెప్పారు.
‘ఎలీ లిల్లీ లాంటి అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా మార్చుకున్నాయి. ఇప్పటికే యూఏఈ పెట్టుబడిదారులు రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇది తెలంగాణ – దుబాయ్ మధ్య రోజురోజుకీ బలపడుతున్న వాణిజ్య సంబంధాలకు చిహ్నంగా భావిస్తున్నాం’ అని చెప్పారు. ‘ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారిని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదు. మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిగా పరిగణిస్తున్నాం.
ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, డిజిటల్ ఎకానమీ, స్మార్ట్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్, వేర్ హౌజింగ్, ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ, ఏరో స్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.


