గిన్నీస్ రికార్డ్ బతుకమ్మను విజయవంతం చేయాలి
29న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహణ
పదివేల మంది మహిళలతో ఘనంగా వేడుకలు
ప్రతి ఆడబిడ్డ పాల్గొని బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటాలి
గాంధీభవన్‌లో మహిళా సమావేశంలో మంత్రి సీతక్క
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఈనెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో ప్రభుత్వం తలపెట్టిన గిన్నిస్ వరల్డ్ రికార్డు బతుకమ్మ వేడుకల్లో మహిళలు అంతా పాల్గొనాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పదివేల మంది మహిళలతో బతుకమ్మను గిన్నిస్ రికార్డులుకు ఎక్కించే లక్ష్యంతో ప్రభుత్వ తరఫున వేడుక నిర్వహిస్తున్నామని, ప్రతి ఆడబిడ్డ పాల్గొని బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటాలని కోరారు. గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమగ్రంగా వివరించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ..
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండగ తెలంగాణకు ప్రత్యేకమైన ఆస్తిత్వం అన్నారు. ఈ పండుగకు సంబంధించిన సాంప్రదాయాలను, ఆరోగ్య ప్రయోజనాలను, చెరువుల పరిరక్షణలో బతుకమ్మ పాత్రను వివరించారు. బతుకమ్మ ఆచారంలో చెరువులకు కృతజ్ఞతా భావం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. పల్లె జీవితానికి, మహిళల సంఘ సంబంధానికి బతుకమ్మ ఎంతో కీలకం అని, బతుకమ్మ వేడుకలను సాంప్రదాయ పద్ధతిలోనే జరుపుకోవాలని సూచించారు.
మహిళల సంక్షేమమే లక్ష్యం
అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రభుత్వం, ప్రత్యేకంగా మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాకుండా మహిళలను బస్సు ఓనర్లుగా చేస్తున్నామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం మహిళల అభయ హస్తం పొదుపు సొమ్మును, రూ.3500 కోట్ల రూపాయల వడ్డినీ ఎగ్గొటిందని గుర్తు చేశారు. అంతకు ముందు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అదే సందర్భంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి సీతక్క నివాళి అర్పించారు. “జోహార్ చాకలి ఐలమ్మ” అని నినాదాలు చేస్తూ ఆమె త్యాగాలను కొనియాడారు.కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్, జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.


