ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక
కాకతీయ,గీసుగొండ: కొమ్మాల జాతర సందర్భంగా ప్రభబండ్ల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ స్పష్టం చేశారు.నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సందర్భంగా డిసిపి ప్రభ బండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలను వివరించారు. ప్రభబండ్లు కేటాయించిన ప్రదేశాల్లోనే తయారు చేసు కోవాలని,ఒక్కో బండికి కనీసం 100 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ జెండాలు వినియోగించరాదని,ఎవరినైనా కించపరిచే లేదా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు,నినాదాలు చేయకూడదని పేర్కొన్నారు. డీజేలను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.అవసరమైతే పరిమిత శబ్దంతో మాత్రమే సౌండ్ సిస్టమ్ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభబండ్లు అధిక ఎత్తులో ఉంటే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. విద్యుత్ వైర్లు,జనరేటర్ల వినియోగంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.ప్రభబండ్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదని, అంబులెన్స్‌లు సహా అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని సూచించారు.ఊరేగింపులో పాల్గొనే వారు మద్యం సేవించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అల్లర్లు జరగకుండా నిర్వాహకులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ప్రభబండ్ల ర్యాలీ మొత్తం సీసీటీవీ,పోలీసు వీడియో పర్యవేక్షణలో ఉంటుందని, స్పెషల్ బ్రాంచ్,ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగు తుందని వెల్లడించారు. మారణా యుధాలు లేదా పేలుడు పదార్థాలు వెంట తీసుకురావడం కఠినంగా నిషేధమని హెచ్చరించారు. ప్రభబండ్లు ఒకరి వెనుక ఒకరు మాత్రమే ప్రయాణించాలనీ, ముందున్న బండిని దాటి వెళ్లే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్స్, విద్యుత్ శాఖలతో పూర్తిగా సహకరించాలని కోరారు. జాతరలో పాల్గొనే వారందరూ చట్టాలను గౌరవించి, శాంతియుత వాతావరణంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీపీ అంకిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసిపి వెంకటేష్,గీసుగొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కుమార్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


