నిలువునీడ లేని గుడెప్పాడు సెంటర్
మండుటెండల్లో ప్రయాణికుల వేదన
రోడ్డు విస్తరణలో కనుమరుగైన బస్టాండ్
ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యంపై ఆగ్రహం
కేటాయించిన స్థలాల్లో ఆక్రమణలు?
ఎండ దెబ్బకు ప్రాణాపాయం ముప్పు
కాకతీయ, ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు సెంటర్‌లో ప్రయాణికులు నిలబడి బస్సుల కోసం ఎదురుచూడడానికి కనీసం నిలువునీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన పాత బస్టాండ్ స్థానంలో కొత్త ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లోనే కాపుకాస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రయాణికుల రద్దీ పెరగడంతో పరకాల, ములుగు వైపు వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గతంలో గుడెప్పాడు సెంటర్‌లో బస్టాండ్ ఉండేదని, రోడ్డు విస్తరణ పేరుతో ఆర్‌అండ్‌బీ అధికారులు దాన్ని తొలగించారని స్థానికులు చెబుతున్నారు. అయితే పనులు పూర్తయి సంవత్సరాలు గడిచినా కొత్త బస్టాండ్ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గ్రామ ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.
ప్రయాణికులకు శాపంగా మారిన నిర్లక్ష్యం
ఆర్‌అండ్‌బీ శాఖ నిర్లక్ష్యంతో గుడెప్పాడు సెంటర్ ప్రయాణికులకు శాపంగా మారిందని గ్రామస్థులు అంటున్నారు. బస్టాండ్ కోసం కేటాయించిన స్థలాల్లో కొంతమంది చిరువ్యాపారులు ఆక్రమణలు చేసి షాపులు నిర్మించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వేసవి తీవ్రత మరింత పెరిగితే వడదెబ్బకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గుడెప్పాడు సెంటర్‌లో తక్షణమే బస్టాండ్ నిర్మించాలని గ్రామస్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.


