- పదేళ్లలో నిరుద్యోగుల కలలు కలలుగానే మిగిలాయి
- నేడు ప్రజా పాలనలో నిజమవుతున్నాయి
- స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖకు వన్నెతేవాలి
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కన్న కలలు గడచిన పది సంవత్సరాలలో కలలుగానే మిగిలాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వారి కలలను నిజం చేస్తోందని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ -1 నియామకాల్లో ఎంపికై స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో జిల్లా రిజిస్ట్రార్‌లుగా నియమితులైన పలువురు అభ్యర్థులు మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు.
బాధ్యతగా పనిచేయాలి
ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని, ఈ కీలక సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో 2011లో గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీ చేయగా, 2018లో భర్తీ ప్రక్రియ పూర్తయిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేస్తే మీరేంది భర్తీ చేసేది, తెలంగాణ సాధించుకున్నతర్వాత స్వరాష్ట్రంలో మా ఉద్యోగాలను మేమే భర్తీ చేసుకుంటామని నిరుద్యొగుల్లో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం శోచనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేసి ప్రజాప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీ, నిబద్దతతో విధులు నిర్వహించి ప్రభుత్వ పేరు ప్రతిష్ఠలను పెంచాలని ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన జిల్లా సబ్ రిజిస్ట్రార్‌లకు మంత్రి సూచించారు.


