పోలీస్ కమిషనరేట్‌ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
జీహెచ్‌ఎంసీ పునర్విభజనతో పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులు
మూడు కమిషనరేట్‌లను 12 జోన్‌లుగా విభజించిన ప్రభుత్వం
హైదరాబాద్‌కు ఆరు, సైబరాబాద్, రాచకొండకు మూడు చొప్పున జోన్‌లు
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై కసరత్తు
కాకతీయ, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నగర విస్తీర్ణం, జనాభా పెరుగుదల, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ల పరిధిని పునర్వ్యవస్థీకరించారు. మూడు కమిషనరేట్‌లను మొత్తం 12 జోన్‌లుగా విభజిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులతో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారనుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఆరు జోన్‌లు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు జోన్‌లను ఏర్పాటు చేశారు. చార్మినార్ జోన్, గోల్కొండ జోన్, ఖైరతాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్, సికింద్రాబాద్ జోన్, శంషాబాద్ జోన్
ఈ విభజనతో పాతబస్తీ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం కానుందని అధికారులు చెబుతున్నారు.
సైబరాబాద్‌లో భారీ మార్పులు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కూడా కీలక మార్పులు చేపట్టారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిని మొయినాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు విస్తరించారు. కూకట్‌పల్లి జోన్‌లోకి మాదాపూర్‌ను చేర్చారు. కుత్బుల్లాపూర్ జోన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్, నివాస ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు అవసరమయ్యాయని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రాచకొండలో మూడు జోన్‌లు
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను మూడు జోన్‌లుగా విభజించారు. ఎల్‌బీ నగర్ జోన్, మల్కాజిగిరి జోన్,
ఉప్పల్ జోన్, ఈ జోన్‌ల ఏర్పాటుతో శివారు ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ మరింత పటిష్టంగా ఉండనుందని భావిస్తున్నారు.
భవిష్యత్ సిటీపై కసరత్తు
పోలీస్ జిల్లాలుగా యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోని మహేశ్వరం జోన్ మారనుంది. అలాగే షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ ఏర్పాటు చేయాలన్న యోచనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో నగర విస్తరణకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం.


