- ములుగు జిల్లా అటవీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్
- ఏటూరునాగారం అటవిలో సీతాకోకచిలుకల సర్వే
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో సీతాకోకచిలుకలు, చిమ్మటల సర్వే ప్రారంభమైందని ములుగు జిల్లా అటవీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 33 మంది వలంటీర్లు పాల్గొన్నారని పేర్కొన్నారు. బెంగళూరు, కేరళ, పట్నా, రాయపూర్, అమరావతి, నాసిక్, పూణే, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి నిపుణులు, ప్రకృతి ప్రేమికులు చేరుకున్నారన్నారు. ఈ సర్వేకు ఓరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలు జ్ఞాన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయన్నారు. సర్వే ప్రధాన లక్ష్యం ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో కొత్త రకాల సీతాకోకచిలుక జాతులను గుర్తించనున్నట్లు వివరించారు. అలాగే ఈ సర్వే ద్వారా అటవీ ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
భవిష్యత్ తరాలకు పచ్చటి, స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రేరణనివ్వడం, ఏటూరునాగారం వంటి జీవ వైవిధ్య సమృద్ధ ప్రాంతాల్లో ఇలాంటి సర్వేలు తోడ్పడతాయన్నారు. ప్రకృతిని కాపాడటంలో సమాజం భాగస్వామ్యమవ్వాల్సిన అవసరం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో అటవీ విభాగ అధికారి (వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్) ఎస్. రమేష్, ప్రధాన శాస్త్రవేత్త, ఎంటమాలజిస్టు చిత్ర శంకర్, ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు, ఓరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇంద్రం నాగేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి చెల్పూర్ శ్యామ్‌సుందర్, పర్యావరణవేత్త, సంయుక్త కార్యదర్శి రవిబాబు పిట్టల పాల్గొన్నారు.


