అనుమతుల్లేకుండానే గ్రావెల్ తవ్వకాలు!
ఇసుక క్వారీ పేరుతో మట్టి దోపిడీ
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం రమనక్కపేట ప్రాంతంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2023లో అనుమతి పొందిన ఇసుక క్వారీ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తూ మట్టి తరలింపులు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో అనుమతులు లేకుండా మట్టిని తవ్వి గోదావరి నదిలోకి రహదారి వేసిన ఘటనపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం కూడా మట్టి తవ్వి ఇసుక క్వారీకి రహదారులు వేసుకుంటున్నారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా నష్టపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు స్పందించకపోవడం వెనుక చీకటి ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై మంగపేట ఎమ్మార్వో తోట రవీందర్‌ను సంప్రదించగా, విషయం తెలిసిన వెంటనే పనులు నిలిపివేశామని తెలిపారు. కేవలం రెండు మూడు టిప్పర్ల మట్టిని మాత్రమే తరలించారని వివరణ ఇచ్చారు. అయితే అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకపోవడం పట్ల స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


